Connect with us

Andhra

యుద్ధం వద్దు – శాంతి ముద్దు.. విజయవాడలో శాంతియుత మహా ర్యాలీ..

Published

on

విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి కోసం విజయవాడ నగరం మరోసారి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పీస్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రజలలో శాంతి ఆకాంక్షను స్పష్టంగా ప్రతిబింబించింది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఉక్రెయిన్ -రష్యావర్ యుద్ధం, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొనాలని కోరుతూ వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మత పెద్దలు ఒకే వేదికపైకి వచ్చారు. “యుద్ధం వద్దు – శాంతి ముద్దు” అనే నినాదాలతో నగర వీధులు మార్మోగాయి. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను గుర్తు చేస్తూ, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ర్యాలీలో పాల్గొన్న వారు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా శాంతికి ప్రతీకగా తెల్లని జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రపంచ పటాన్ని చేతబట్టి, యుద్ధాల వల్ల ప్రభావితమవుతున్న దేశాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. మానవాళి శ్రేయస్సు కోసం యుద్ధ మేఘాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు.

ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో పలువురు ప్రముఖులు మాట్లాడారు. గోల్ల నారాయణరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మొత్తం మానవాళిపైనే ఉంటుందని, శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ.. మతాల అసలు సారం శాంతి, ప్రేమ, సహనమేనని, వాటిని అనుసరిస్తే యుద్ధాలకు తావుండదన్నారు.

రెవరెండ్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ.. మానవత్వమే మతాల మూలమని, పరస్పర గౌరవంతోనే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు క్రిస్టియన్ చర్చిల సమాఖ్య ప్రతినిధులు శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జమాత్ ఇస్లామి హింద్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరీముద్దీన్ మాట్లాడుతూ.. ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో మానవ వినాశనానికి కారణమౌతున్న యుద్ధాలను ఆపాలని పిలుపు ఇచ్చారు. జేఐహెచ్ నాయకులు..డాక్టర్ రహ్మాన్, అబ్దుల్ మతీన్ ఖలీలుల్లాహ్,‌ నగర అధ్యక్షులు, తమ ప్రసంగాల్లో యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బౌద్ధ భిక్షువులు వెన్ జోయిస్సారా, వెన్ అగ్గనమాస మాట్లాడుతూ.. అహింస, శాంతి బౌద్ధ తత్వంలో ప్రధానమైన విలువలని, ప్రపంచం ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం అధిపతి స్వరూప రాణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాంతి, సహనం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.

మాజీ మంత్రి వద్దే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం నాగరిక సమాజ లక్షణమని, శాంతి సాధనలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ముస్లిం జేఏసీ నేతలు షేక్ మునీర్ అహ్మమద్ మరియు అన్ని ప్రజా సంఘాల వారు ముఖ్య భూమిక నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాంతి, సహనమే మానవ సమాజానికి శాశ్వత మార్గమని, యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదని వారు పునరుద్ఘాటించారు.

మొత్తానికి, విజయవాడలో నిర్వహించిన ఈ శాంతి ర్యాలీ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించింది—మానవత్వం నిలవాలంటే యుద్ధం కాదు, శాంతి మార్గమే సరైనదని వక్తలు పేర్కొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.