Andhra
సమాజ సేవలో మాజీ ZPTC జాకీర్ హుస్సేన్..
కంభం: ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో సామాజిక స్పృహకు, సేవానిరతికి చిరునామాగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్నారు మాజీ జడ్పీటీసీ మరియు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సయ్యద్ జాకీర్ హుస్సేన్.
స్థానిక ఏబీఎం చర్చి సమీపంలో అర్ధవీడు వెళ్ళు మలుపు వద్ద గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయగా, ఇటీవల అక్కడ కాలువ మరమ్మత్తుల పనులలో అవి ధ్వంసం అయ్యాయి. దీనితో నిత్యం అటువైపుగా వెళ్ళు ప్రయాణికులు కూర్చునే చోటు లేక అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్యను గుర్తించిన మాజీ జడ్పీటీసీ జాకీర్ హుస్సేన్ వెంటనే స్పందించి తన స్వంత నిధులతో రెండు నూతన సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది.
అదే విధంగా స్థానిక శరభారెడ్డి వీధిలోని పాత లైబ్రరీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడికి నిత్యం వచ్చే భక్తులకు కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకొనుటకు సరైన నీటి వసతి లేక భక్తుల ఇబ్బంది గమనించిన ఆయన అక్కడ ఉన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు వెంటనే శాశ్వత నీటి కుళాయి కొరకు గ్రామ పంచాయతీ వారితో మాట్లాడి నీటి కనెక్షన్ మంజూరు చేయగా, దానికి కావాల్సిన వస్తువులను సొంత నిధులతో తెప్పించి సత్వరమే ఆంజనేయ స్వామి గుడికి నీటి వసతిని కల్పించడం జరిగింది. దీనితో ఎంతో కాలంగా నిత్యం అసౌకర్యానికి గురవుతున్న భక్తులు కుల మతాలకు అతీతంగా చేస్తున్న జాకీర్ హుస్సేన్ వితరణ కార్యక్రమాలను కొనియాడి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామ సంక్షేమానికి, అవసరార్థుల కొరకు తన శక్తి మేరకు ఎల్లప్పుడూ కృషి చేస్తుంటానని, ఇటువంటి సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తిని కలుగజేస్తాయని చెప్పారు. యువనాయకుడు జాకీర్ హుస్సేన్ సేవలను పలువురు పెద్దలు కొనియాడారు.
![]()
