Andhra
వైసిపిపై విమర్శలు మాని మెడికల్ కాలేజ్ నిర్మాణంపై దృష్టి పెట్టండి.. సయ్యద్ గౌస్ మోహిద్దీన్
మార్కాపురం: వైసిపి ప్రభుత్వ హయాంలో పేదలకు ఉచిత వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరం గ్రామం నందు 80 శాతం పైగా నిర్మించిన మెడికల్ కళాశాలను స్థానిక కూటమి నాయకులు సందర్శించి,వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా మోసగించారని,మెడికల్ కాలేజీ నిర్మాణం తుది దశలలోనే ఉందని కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలను వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పిపిపి విధానంతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే కార్పొరేట్ యాజమాన్యాలు పేదల రక్తాన్ని జలగల్లా పీక్కు తింటారని అన్నారు. కూటమి నాయకులు కమిషన్ల కోసం మెడికల్ కళాశాల ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి, పేదలకు ఉచిత వైద్యం అందనివ్వకుండా వైద్యమో! రామచంద్ర అనే విధంగా కూటమి నాయకులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వానికి పేద ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే మెడికల్ కళాశాల నిర్మాణం చేయాలని ఆయన సూచించారు. కూటమి నాయకులు రాజకీయ విమర్శలు మాని మెడికల్ కళాశాల పూర్తి చేయడంపై దృష్టి పెడితే పేద ప్రజలకు మేలు చేసిన వారవుతారని ఆయన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, వైసిపి పార్టీ ఇక అధికారంలోకి రాదని కూటమి నేతలు పగటి కలలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏపీలో వైసిపి ఐదేళ్లు పాలిస్తే రెండేళ్లకు పైగా కరోణా ఎఫెక్ట్ కొనసాగిందని, అయినా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సయ్యద్ గౌస్ మొహిద్దీన్ అన్నారు.
![]()
