Andhra
ఇద్దరు సివిల్ సర్వెంట్లు పెళ్ళి ఖర్చు రెండు వేలు
జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక… గుర్తుండిపోవాలి అంటూ రూ.లక్షలు, కోట్లు పోసి మరీ పెళ్లిళ్లు జరుపుకొంటున్నారు. ఇందుకు పేద, ధనిక అన్న తేడా లేదు. అలాంటిది ఇద్దరు సివిల్ సర్వెంట్ల పెళ్లంటే ఎంత ఘనంగా జరగాలి? కానీ వాళ్లు పెళ్లికి ఖర్చు పెట్టిందెంతో తెలుసా? రూ.2 వేలు.ఐపీఎస్ ఆఫీసర్ మౌనికది తెలంగాణ కేడర్. ఐఏఎస్ ఆఫీసర్ యువరాజ్ మర్మత్ ది ఛత్తీస్ గఢ్ కేడర్. మౌనిక ఫార్మకాలజీ పూర్తిచేసి, సివిల్స్ వైపు వెళ్లారు. యువరాజ్ రాజస్థాన్. ఈయన సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగమూ చేశారు. తరవాత కొలువుకు రాజీనామా చేసి,సివిల్ సర్వీసెస్ సాధించారు. ఇద్దరూ 2022 బ్యాచ్కు చెందినవారే. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తీసుకుంటున్న సమ యంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2023లో పెళ్లి పీటలెక్కారు. అయితే తమ పెళ్లి హంగు, ఆర్భాటాలకుదూరంగా ఉండాలని కోరుకున్నారిద్దరూ. బ్యాండు బాజా, ఖరీదైన రిసెప్షన్, వేలమంది జనాల మధ్య కాదు… అయిన వాళ్ల మధ్య సింపుల్గా చేసుకోవాలని భావించారు. కాబట్టే, కుటుంబసభ్యులు, స్నేహితులు, సహాధ్యాయుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్ట్రే షన్, పూలదండలు, స్వీట్లకు అయిన ఖర్చు రూ. రెండు వేలే. తాజాగా తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ మౌనిక ఇన్స్టాలో ఓ రీల్ పెట్టారు. అదికాస్తా నెటిజన్లను ఆకర్షించడంతో వైరలైంది. పెళ్లంటే నిబద్ధత, కలకాలం తోడుం టామని చేసుకునే బాస… అంతేకానీ అనవసర ఖర్చు కాదు. అది నిరూపిస్తున్న వీళ్లు అందరికీ ఆదర్శమంటూ నెటిజన్లు కితాబులూ ఇస్తు న్నారు. వాళ్ల ప్రయత్నం నిజంగానే అభినంద నీయం కదూ!
![]()
