Andhra
రైలు మార్గంతో పశ్చిమ ప్రకాశంలో ఆనందోత్సాహాలు..
ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం అయ్యాయి. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో స్పీడ్ పెంచారు.. కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యలను ఏడాదిలోనే పరిష్కరించింది. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కలను త్వరలోనే నెరవేర్చేలా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ, పరిహారం సమస్యలను పరిష్కరించడంతో రైల్వేస్టేషన్ల నిర్మాణం, ట్రాక్ పనులు ఊపందుకున్నాయి. నడికుడి -శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ మొత్తం పొడవు 308.76 కిలోమీటర్లు ఉంది.. ప్రకాశం జిల్లాలో 107 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మేరకు ఆ పనులు చేపట్టారు.. ఈ రైల్వే లైన్ కోసం ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 32 గ్రామాల నుంచి 897.21 ఎకరాల భూమిని సేకరించారు అధికారులు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్కు సంబంధించి గతేడాది మార్చి 24న గుండ్లకమ్మ-దర్శి వరకు ట్రాక్ పూర్తయింది. అంతేకాదు పొదిలి వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం దర్శి-కనిగిరి మధ్య రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 52 కిలోమీటర్ల మేర మూడో దశ పనులు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది చివరి నాటికి కనిగిరి వరకు రైలు నడిచే అవకాశం ఉందని క్షేత్ర స్థాయిలో సందర్శించిన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ నుండి పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి వరకు పనులు జరుగుతున్నాయి. పొదిలిలోని రాజుపాలెం వరకు రైల్వేకట్ట పనులు పూర్తయ్యాయి. ఈ పనుల్ని వేగవంతం చేసి పొదిలి, కనిగిరి, రాజుపాలెం కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలలో ఆనందం వ్యక్తం అవుతుంది.
![]()
