Andhra
సరిగ్గా సాక్ష్యం చెప్పనందుకు ఏడాది జైలు ఫిర్యాదుదారుపై క్రిమినల్ కేసు
ఏలూరు: ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపునకు ఇద్దరు లబ్దిదారుల నుంచి లంచం తీసుకున్న గృహనిర్మాణ సంస్థ ఏఈకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పని ఫిర్యాదుదారుకు ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు నిచ్చింది. ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగలక్ష్మి, సుంకర దైవకృప గతంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించుకున్నారు. 2009లో వాటి బిల్లుల మంజూరుకు అప్పటి ఉండ్రాజవరం మండల గృహ నిర్మాణ సంస్థ ఏఈ యలమంచిలి ప్రకాశరావు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో లబ్దిదారుల తరపున అదే గ్రామానికి చెందిన బస్వా నాగవెంకట గణేశ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇంజినీర్ లబ్దిదారుల వద్ద లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కేసు తుది విచారణలో గణేశ్ సరిగా సాక్ష్యం చెప్పక పోవడంతో… లంచం తీసుకున్న ప్రకాశరావుపై కేసు కొట్టేసి, గణేశ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో తుది విచారణలో చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
![]()
