Andhra
భయపెట్టి దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్
*నీరసానికి రూ.50 వేలు – జ్వరానికి రూ.70 వేలు – దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు*
తాడేపల్లిగూడెం: రోగుల వ్యాధి నిర్ధారణ కాకుండానే పరీక్షల పేరుతో వైద్యుల అధిక రుసుము – ప్లేట్లెట్ల సంఖ్య తగ్గాయంటూ అనవసర వైద్య పరీక్షలు చేయిస్తున్న వైద్యులు.ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉపయోగించు కోవాలని DMHO హితవు.వాతావరణంలో మార్పులొచ్చాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపాటి జ్వరమొచ్చినా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు ప్రైవేటు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. ప్రజల అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని మరీ దోపిడీకి తెరదీస్తున్నారు. అంతేకాకుండా సాధారణ జ్వరానికే రూ.వేలల్లో ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారు.
అస్వస్థతకు రూ.50 వేలు: తరచూ కళ్లు తిరుగుతున్నాయని ఓ వ్యక్తి తణుకు రాష్ట్రపతి రోడ్డులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎటువంటి పరీక్షలు చేయకుండానే ఏకంగా అత్వసర విభాగానికి (ఐసీయూ)కి తరలించారు. అంతేకాకుండా తర్వాత పరీక్షలు, ఇతర చికిత్సల పేరుతో రూ.50 వేలు బిల్లు వేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తణుకుకు చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.జ్వరానికి రూ.70 వేలు: జ్వరంగా ఉందని సుబ్బారావుపేటకు చెందిన ఎన్. ప్రసాద్ తాడేపల్లిగూడెం పట్టణం రామారావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి వివిధ పరీక్షలు చేశారు. అనంతరం మందులిస్తూనే అయిదు రోజులకు గాను దాదాపు రూ.70 వేలు బిల్లు వేశారు. అంతేకాకుండా ఇంకా పరీక్షలు చేయాలని అంటున్నారని, ఇంకా ఎంత ఖర్చవుతుందోననే భయం వెంటాడుతుందని అతను ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్యపరీక్షల పేరుతో దోపిడీ: జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులతో వైద్యులు చేస్తోన్న వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోంల పేరుతో వెలిసిన ఆసుపత్రుల్లో పరీక్షలతో సరికొత్తగా దోపిడీకి దిగుతున్నారు. డెంగీ నిర్ధరణకు ఎలీసా పరీక్షలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే నిర్ధరణ చేయాల్సి ఉండగా కొంతమంది వైద్యులు పరీక్షల పేరుతో నిలువునా దోచుకుంటున్నారు. ఇటీవల డెంగీ లేకుండానే వైద్యం చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ ఆసుపత్రి యాజమాన్యంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ రుసుములు, ల్యాబ్, ఇతర అన్నింటి రుసుముల బోర్డుల ప్రదర్శన చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది వైద్యుల తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
èΦప్లేట్లెట్ల సంఖ్య పేరుతో అధిక ఫీజులు: వాతావరణంలోని నెలకొన్న మార్పులతో కొంతమందికి దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రాగానే సహజంగానే శరీరమంతా వేడెక్కుతోంది. దీంతో ప్రభుత్వాసుపత్రులున్నప్పటికీ చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం కావడంతో సాధారణ జ్వరమైనా సరే డెంగీ అనుమానం వ్యక్తం చేసి, పరీక్షలు రాసేస్తున్నారు. దీంతోపాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గాయంటూ రోగుల్లో భయం రేపుతున్నారు.ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని ఒక్కో రోగి నుంచి ల్యాబ్, ఆసుపత్రి ఛార్జీలు, మందులు కలిపి కనిష్ఠంగా రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రజలు జ్వరంపై భయాన్ని వీడి ప్రభుత్వాసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో గీతాబాయి వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుముల ప్రదర్శనపై నూతన విధానాలు రూపొందించి ఆసుపత్రులకు పంపించామని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో గీతాబాయి వైద్యులను హెచ్చరించారు.
![]()
