Connect with us

Andhra

ఇదేనా సనాతన ధర్మం.. ? పవన్ కళ్యాణ్ పై విసుర్లు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

Published

on

అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో కొబ్బరి, అరటి, పొగాకు, పత్తితోపాటు అన్ని పంటలకూ ధరలు తగ్గాయని, రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించకుండా కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇదేనా పవన్ అనుసరిస్తున్న సనాతన ధర్మం?, తక్షణమే ఆయన వ్యాఖ్యలను విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలని, బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, పైగా దిష్టితగిలితే పంటలు ఎండిపోతాయని అనడమేనా ఆయనకు తెలిసిన సనాతన ధర్మం అని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను బాధ్యత కలిగిన పవన్‌ కల్యాణ్‌ ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమేనని, పవన్‌ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రా, తెలంగాణ) ప్రజలు సోదర భావంతో కలిసిమెలసి ఉంటున్నారని పేర్కొన్నారు. అలాంటి తరుణంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ విభేధాలు సృష్టించేలా ఉన్నాయని అన్నారు.

సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదన్నారు. మూఢ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం తగదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కల్యాణ్ అనర్హుడని, తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.