Andhra
మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. షేక్ సైదా
మార్కాపురం: ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 179 లైసెన్స్ గల మద్యం షాపులు నడుస్తుండగా వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన, వాడ వాడనా, వీధి వీధిలో కుప్పలు తెప్పలుగా నడుస్తున్నాయని ఎలాంటి సమయపాలన లేకుండా అర్ధరాత్రిలో సైతం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఎమ్మార్పీ రేట్లు కంటే అదనంగా బాటిల్ పై 10 నుంచి 20 రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారని సైదా అన్నారు.
చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో దాదాపు 25 వేల మందికి పైగా కార్మికుల పనిచేస్తున్నారని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేసి వారిని మత్తులో ముంచి పని చేయిస్తున్నారని తరచూ ప్రమాదాలకు గురై ఈ క్వారీల్లో అనేకమంది కార్మికులు చనిపోతున్నారనీ, దీనికి కారణం ఎక్సైజ్ శాఖ సక్రమంగా తనిఖీలు నిర్వహించకపోవడమే కారణమని సైదా అన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది షాపుల్ని తనిఖీలు చేయకుండా నెలవారి మామూలు కక్కుర్తి పడి ఎక్సైజ్ శాఖ మామూళ్ల మత్తులో జోగుతుందని సైదా తీవ్రంగా విమర్శించారు.
ఒక్కొక్క మద్యం షాపు నుండి నెలకి 20 వేల నుంచి 30 వేలకు పైగా మామూళ్లు అందుకొని అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు ఇస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా మద్యాన్ని అమ్మే షాపులను వెంటనే సీజ్ చేసి, లైసెన్సులను రద్దు చేయాలని, బెల్ట్ షాపులపై విస్తృతంగా దాడులు నిర్వహించి గ్రామాల్లో మద్యం షాపులు లేకుండా నిరోధించాలని సైదా కోరారు. లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ముట్టడిస్తుందని సైదా తెలిపారు.
ప్రకాశం జిల్లాలో చెలరేగుతున్న మద్యం మాఫియాపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు ఉన్నత అధికారులు దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
![]()
