Andhra
విజయవంతం అయిన మాక్ మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం..
మార్కాపురం: ప్రకాశం జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లాలో అత్యధిక విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో కేవలం ఆరు పాఠశాలల్లో మాక్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించమని కోరారని, అందులో మన పాఠశాల ఉండడం మనకు గర్వ కారణం అని, అందులో భాగంగా కేవలం విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా, విద్యార్థుల తల్లిదండ్రులుగా వివిధ పాత్రలను పోషిస్తూ మాక్ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్ర శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, వారికి బోధనా రంగంలో అనుభవాన్ని అందించడానికి, విషయ పరిజ్ఞానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారో స్వయంగా తెలుసుకునే అవకాశం ఏర్పడి కష్టపడి చదివి మంచి పౌరులుగా రాణిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు ప్రముఖ పాత్ర వహిస్తూ ప్రధానోపాధ్యాయులుగా లోహిత్, కలెక్టర్ గా అబ్దుల్ కరీం, స్థానిక శాసన సభ్యులుగా కార్తీక్, మార్కాపురం సబ్ కలెక్టర్ గా నరసింహ మరియు తొమ్మిది, పదవ తరగతి చదివే విద్యార్థులు ఉపాధ్యాయులుగా, తల్లిదండ్రులుగా పాల్గొని కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా మరియు ఉత్సాహ భరిత వాతావరణంలో విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
