Andhra
ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం :లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో 1990వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో జరగటం వలన 1991 నుండి 2001 మద్య అక్షరాస్యత 17 శాతం పెరిగిందని, నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే అక్షరాంధ్ర ఉద్యమం కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తేనే సత్ఫలితాలు వస్తాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు. ఈనెల 7వ తేదీ సోమవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో మీడియా సమావేశంలో ప్రసంగించారు. 1990 లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజా సంఘాల ఐక్య కృషితోనే ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత ఉద్యమం బలోపేతం అయిందన్నారు. ప్రతి 10మంది నిరాక్షరాస్యులకు ఒక విద్యావంతులైన స్వచ్ఛంద సేవకులు ఎలాంటి వేతనం తీసుకోకుండా, అక్షర కేంద్రాలలో నిరాక్షరాస్యులకు విద్యను అందించినాడని తెలిపారు. ప్రతి జిల్లాలో 40 వేల నుండి 50 వేల మంది స్వచ్ఛంద సేవకులు 4 లక్షల నుండి 5 లక్షల మందికి విద్యను బోధించినారని వివరించారు. వేలాదిమంది కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళారూపాల ద్వారా అక్షరాస్యత అవసరాన్ని తెలిపినారన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో భారతదేశంలో అట్టడుగున ఉందని ప్రతి ముగ్గురులో ఒకరు తన మాతృభాషలో చదవడం, రాయటం లేని స్థితిలో ఉందన్నారు. 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు లోపు వారు 81 లక్షలమంది ఆంధ్రప్రదేశ్ లో నిరాక్షరాస్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో లేకపోవడం, ఒకే ఉపాధ్యాయుడు వివిధ తరగతులను బోధించటం, పాఠశాలలు విలీనం లాంటి కారణాలతో ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా బాల బాలికలు మధ్యలోనే బడి మానేసి నిరాక్షరాస్యులుగా మారుతున్నారన్నారు. భారతదేశంలో మిజోరం, లక్షదీప్, కేరళ, త్రిపుర, గోవా, నాగాలాండ్, మేఘాలయ, చండీఘర్, పాండిచ్చేరి, మణిపూర్ లాంటి రాష్ట్రాలు 90 శాతంపైగా అక్షరాస్యత కలిగి ఉంటే మరొకవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు 75 శాతం లోపుగానే అక్షరాస్యత కలిగి ఉన్నాయన్నారు. ప్రపంచంలో సగటు అక్షరాస్యత 84 శాతం ఉంటే భారతదేశం 80 శాతం గా ఉంటూ అక్షరాస్యతలో ప్రపంచంలో 94వ స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో 70 దేశాలలో 99 శాతంపైగా అక్షరాస్యత ఉందని, మరో 50 దేశాలలో 90 శాతం అక్షరాస్యత ఉందన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ముగ్గురు నిరాక్షరాస్యులలో ఒక్కరు భారతీయులుగా ఉండటం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే అక్షరాంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించకుండా అన్ని రాజకీయ పార్టీలను, యువజన, విద్యార్థి సంఘాలను, కళాకారులను, ఉపాధ్యాయులను, స్వచ్ఛంద సంస్థలను వినియోగించి ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తేనే సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
![]()
