Andhra
పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి…
రూ 10 లక్షల నష్ట పరిహారం… కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి…
డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని కాపాడాలి…
ఏడాది పాలన సంబరాలే కానీ రైతులకు ఓరగబెట్టింది ఏమి లేదు…
రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు…
రైతులు, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కేరళ తరహాలో గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేసి రైతులకు భరోసా ఇవ్వాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మంగళవారం ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందిన ముగ్గురు కౌలు రైతులవి ఆత్మహత్యలు కాదని ప్రభుత్వ హత్యలన్నారు. రైతుల ఆత్మహత్యల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ 10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో కేరళ తరహా రుణ విమోచన, మద్దతు ధరల చట్టం చేసి రైతులకు రెట్టింపు ఆదాయం దక్కేలా చూడాలని సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న 30 లక్షల మంది కౌలు రైతు కుటుంబాలు ఓటు హక్కు కలిగి ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉన్నారన్నారు. అప్పులు చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే
మిర్చి, పొగాకు ఇతర వాణిజ్య పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ ల కోసమేనన్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న సంస్థలు వృద్ధి చెందక రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారిందని రైతాంగ ఉద్యమ సమయంలో ప్రధాని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి రైతుకు రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని
చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది సంబరాలు చేసుకున్నారే కానీ రైతులను పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ రంగం పరిరక్షణకు రైతు సంక్షేమానికి రైతు సంఘాలు చేపట్టే పోరాటాలను రైతులు బలోపేతం చేయాలని పోరాటాల ద్వారా హక్కులు సాధించాలని పిలుపునిచ్చారు.
![]()
