Connect with us

Andhra

ఆంధ్రప్రదేశ్ : ఏమిటీ డిజీలక్ష్మీ పథకం

Published

on

ప్రజలకు వేగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆన్‌లైన్‌ సర్వీసులు అందించడంతో పాటు విద్యావంతులైన డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ సర్కారు ”డిజిటల్‌ లక్ష్మీ (డిజీలక్ష్మీ)” పేరిట వివిధ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ డిజిటల్‌ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమ తుదిరూపుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులివ్వనుందని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ (మెప్మా) అదనపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు బీబీసీకి తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా చేయడమే ఈ పథకం లక్ష్యం అలాగే డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ”డిజిటల్‌ లక్ష్మి” కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని వెంకటేశ్వరరావు చెప్పారు.

జూన్‌ 12న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు.

డ్వాక్రా మహిళలతో సీఎస్సీల ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్‌ ఇండియా నినాదంతో డిజిటల్‌ సాధికారత లక్ష్యంగా కామన్‌ సర్వీస్‌ సెంటర్ (సీఎస్‌సీ)లను అందుబాటులోకి తెచ్చింది.ఈ సీఎస్‌సీలు ప్రజలకు వివిధ ఆన్‌లైన్‌ సర్వీసులు అందిస్తుంటాయి.

ముఖ్యంగా వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ప్రజా వినియోగ సేవలకు ఇవి ప్రవేశ ద్వారాలుగా ఉంటాయి. కేంద్ర నిబంధనల ప్రకారం అర్హులైన విద్యావంతులు ఈ సీఎస్‌సీ లైసెన్స్‌ తీసుకోవడానికి సుమారు రూ.లక్షా 50 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ లక్షా 50వేల ఖర్చును మాఫీ చేయించి డ్వాక్రా మహిళలకు తొలివిడతగా రాష్ట్రంలో 10వేల సీఎస్‌సీలను ఇప్పించాలని నిర్ణయించింది.

ఆ మేరకు ఇప్పటికే సీఎస్‌సీ సేవలు అందించే ఈ గవర్నెన్స్‌తో మెప్మా ఎంవోయూ చేసుకుందని మెప్మా ఏఎండీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

ముందుగా 10వేల కేంద్రాలు

ముందుగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒక డిజిటల్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 10వేల కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

ఈ సేవాకేంద్రాల ఏర్పాటుకు అర్హత సాధించిన మహిళలు తమ ఇంటి ముందు లేదా ఇంటికి సమీపంలో ఒక చిన్న దుకాణం (మీ సేవా కేంద్రం తరహా) ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి.

ఈ క్రమంలో ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన, కంప్యూటర్‌ నైపుణ్యం ఉన్న వారిని గుర్తిస్తున్నారు.

ఏయే సేవలు లభిస్తాయంటే…

పింఛన్, రేషన్‌ కార్డు, హెల్త్‌ కార్డు, రైతు భరోసా వంటి సేవలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడం, దరఖాస్తు చేయించడం, ప్రభుత్వాల నుంచి పౌరులకు అందే సిటిజెన్‌ సర్వీసులు, ఆధార్‌ అప్‌డేట్, పాన్‌ అప్లికేషన్, బ్యాంకులకు రుణాలు, డిపాజిట్‌ల చెల్లింపులు, బీమా పెట్టుబడులు, చెల్లింపులు, ఈ-మొబిలిటీ, రైల్వే, బస్‌ టికెట్ బుకింగ్‌.. వంటి ఇతర డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కార్మికశాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–శ్రమ్‌’ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ఈ సెంటర్లలో చేసుకోవచ్చు.

అర్హులెవరు?

కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి 21 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న డ్వాక్రా మహిళలు ఈ కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటుకు అర్హులు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్, బయో మెట్రిక్‌ డివైజ్, ఇతరత్రా సామగ్రి అవసరమవుతుంది. ఇందుకు దాదాపు రూ.2లక్షలు ఖర్చు కానుంది. ఎంపికైన మహిళలకు రూ.2 లక్షల రుణం మెప్మానే బ్యాంకుల నుంచి ఇప్పిస్తుంది.

ఆయా సేవలకు సర్వీస్‌ చార్జీలు తీసుకోవడం ద్వారా ప్రతి సెంటర్‌కు నెలకు కనీసంగా రూ.30వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే ఉపాధి పొందడం ద్వారా డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మంచి అవకాశమని మెప్మా ఏఎండీ వెంకటేశ్వరరావు అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.