War
అమెరికా గాజా యుద్ధ విరమణ కొత్త ఒప్పందం..నిలుస్తుందా..?
దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ముందడుగు వేశారు. గాజాలో శాంతి స్థాపన కోసం 20 సూత్రాలతో కూడిన ఒక సమగ్ర ప్రణాళికను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే శాంతి నెలకొంటుందని, లేదంటే హమాస్ను పూర్తిగా తుదముట్టించేందుకు ఇజ్రాయెల్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరియు అరబ్ దేశాలు కూడా మద్దతు ప్రకటించారు. అయితే, హమాస్ ఒప్పుకోకపోతే “పనిని పూర్తి చేస్తామని” ఆయన కూడా హెచ్చరించారు. “ఈ పని సులభ మార్గంలోనైనా కావచ్చు లేదా కఠిన మార్గంలోనైనా కావచ్చు” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం, హమాస్ అంగీకరిస్తే వెంటనే యుద్ధం ఆగిపోతుంది. బందీలుగా ఉన్నవారిని, మరణించిన వారి మృతదేహాలను 72 గంటల్లోగా ఇజ్రాయెల్కు అప్పగించాలి. గాజాలో నిపుణులతో ఒక తాత్కాలిక టెక్నోక్రాటిక్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. గాజాను తమ దేశంలో విలీనం చేసుకోబోమని, అక్కడి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించబోమని ఇజ్రాయెల్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. గాజా పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించేందుకు “బోర్డ్ ఆఫ్ పీస్” అనే కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేస్తారు. దీనికి ట్రంప్ ఛైర్మన్ గా వ్యవహరించనుండగా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటివారు సభ్యులుగా ఉంటారు. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. శాంతికి కట్టుబడిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుందని, మిగిలిన వారు విదేశాలకు సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారని, ప్రాంతీయ, అంతర్జాతీయ దళాలు గాజాలో భద్రతను పర్యవేక్షిస్తాయని ఇందులో పేర్కొన్నారు. లక్ష మంది చావులకు, రెండు లక్షల మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఇజ్రాయిల్ ఒప్పందాన్ని హమాస్ ఒప్పుకుంటుందా లేదో చూడాలి మరి.
![]()
