India
BRS నుంచి కవిత సస్పెన్షన్.. కవిత దారెటు..?
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్కుమార్, టి.రవీందర్రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది.
“ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు” అని భారత రాష్ట్ర సమితి పేర్కొంది. కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు.
తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల కవిత ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత.. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కవిత వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెడుతుందా.?ఇతర పార్టీల వైపు వెల్లే ఆలొచన చేస్తుందా..అనేది వేచి చూడాలి. తనపై సస్పెన్షన్ విధించడాన్ని కవిత ఏ విధంగా స్పందిస్తుందో అని బిఆర్ఎస్ మరియు ఆమె అనుచరులు వేచి చూస్తున్నారు.
![]()
