Connect with us

World

డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

Published

on

అమెరికా వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ”నో కింగ్స్” అనే గ్రూపు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

వాషింగ్టన్ డీసీలో ట్రంప్ నిర్వహించిన మిలిటరీ పరేడ్‌ను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా సైనిక కవాతు నిర్వహించడం చాలా అరుదు. ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్, ఇతర ప్రాంతాల్లో నిరసనలు జరిగిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ సైనిక కవాతును నిర్వహించారు.

అమెరికా జాతీయ జెండాలు, ట్రంప్‌ను విమర్శించే ప్లకార్డులు పట్టుకొని గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ఫిలడెల్ఫియా, న్యూయార్క్ సహా చాలా నగరాల్లో చట్టసభ సభ్యులు, యూనియన్ లీడర్లు, కార్యకర్తలు ప్రసంగించారు.

అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఈ మిలిటరీ పరేడ్ ఏర్పాటు చేశారు. శనివారమే ట్రంప్ పుట్టినరోజు కూడా.

పరేడ్ జరిగే చోట ఎలాంటి నిరసనలు జరిగినా ”భారీ బలగాలతో (హెవీ ఫోర్స్)” అణిచివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

వందలాదిగా జరిగిన ఈ నిరసనల్లో లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు చెప్పారు.

ఫిలడెల్ఫియాలోని లవ్ పార్క్‌లో ప్రజలు సమావేశమయ్యారు. ”మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా” అని అసోసియేటెడ్ ప్రెస్‌తో 61 ఏళ్ల నర్స్ కరెన్ వాన్ త్రిస్టే అన్నారు.

తాను ఈ నిరసనల్లో పాల్గొనడానికి ప్రజారోగ్య సంస్థల్లో ట్రంప్ ప్రభుత్వం సిబ్బంది కోత విధించడం ఒక కారణమని ఆమె చెప్పారు.

ప్రజలు అధికంగా పోగయిన ప్రదేశాల్లో లాస్ ఏంజెలెస్ ఒకటి. వారం కిందట ట్రంప్ ఇక్కడికి నేషనల్ గార్డ్ దళాలను పంపించారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య గవర్నర్ గావిన్ న్యూసమ్‌కు నచ్చలేదు.

ట్రంప్ అమలు చేస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగానే తాను నిరసనల్లో పాల్గొనడానికి వచ్చానని బీబీసీకి మానవ హక్కుల గ్రూప్ ‘బ్రౌన్ బెరెట్స్’ సభ్యుడు జోస్ అజెక్లా చెప్పారు.

”అవి కఠిన విధానాలే కాదు, చాలా క్రూరమైనవి. కుటుంబాలను విడదీయకూడదు” అని ఆయన అన్నారు.ఫెడరల్ భవనం సమీపంలో నేషనల్ గార్డ్ సైనికులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. జనాలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్‌ను వాడారు.

కానీ, అక్కడికి సమీపంలోనే మరోచోట వందల మంది నిరసనకారులు శాంతియుత ర్యాలీ కొనసాగించారు.

ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అయ్యాక భారీగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఆయన విధానాలు ప్రజల్లో చాలా పాపులర్ అయ్యాయని ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి.

గత వారం సీబీఎస్/యూగవ్ సర్వేలో, అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారులను బహిష్కరించాలన్న ఆయన విధానాలను 54 శాతం మంది అమెరికన్లు ఆమోదించారు. 46 శాతం మంది తిరస్కరించారు.

ట్రంప్ విధానాలను చూసి తాము సేఫ్‌గా ఫీలవుతున్నామని 42 శాతం అమెరికన్లు చెప్పారు. భయంకరమైన నేరస్థులను బహిష్కరించడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని 53 శాతం మంది చెప్పారు.

ట్రంప్ తన రెండో పదవీకాలంలో అధ్యక్షుడికి ఉండే అధికార పరిమితులను అతిక్రమించారని విమర్శిస్తూ ఈ నిరసనలకు ”నో కింగ్స్” అనే పేరు ఎంచుకున్నారు.యూనిఫామ్‌లో ఉన్న వేలమంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు కవాతుగా వెళ్తుండగా పరేడ్‌లో ట్రంప్ వారికి సెల్యూట్ చేశారు.

సైనికులకు కృతజ్ఞత తెలుపుతూ ట్రంప్ క్లుప్తంగా మాట్లాడారు.

”మన సైనికులు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ఎవరికీ లొంగరు. దేన్నీ వదిలిపెట్టరు. వాళ్లు ఫైట్ చేసి విజయం సాధిస్తారు” అని ట్రంప్ అన్నారు.

అయితే ఈ సైనిక కవాతు ఒక ఖరీదైన, ఆడంబరమైన పని అని కొంతమంది రాజకీయ నాయకులు, మాజీ సైనిక నాయకులు విమర్శించారు.

ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం, దీని ఖర్చు 25 మిలియన్ డాలర్ల నుంచి 45 మిలియన్ డాలర్లు.

కానీ, ఈ కార్యక్రమానికి హాజరైనవారు బీబీసీతో మాట్లాడుతూ, ‘‘దేశ సైనికశక్తికి సంబంధించిన వేడుక ఇది’’ అని అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.