World
నేపాల్ లో సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత.. హోంమంత్రి రాజీనామా
ఖాట్మండు: నేపాల్ అట్టుడుకుతోంది.. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు Gen-z పేరుతో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రధాని ఓలి తీరును తప్పుబడుతున్న ఆందోళనకారులు. సోషల్ మీడియాపై బ్యాన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటు జర్నలిస్టు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఇక పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ రాజధాని ఖాట్మండు సహా 10 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. నేపాల్లో జరిగిన Gen Z ఆందోళనల్లో ఇప్పటివరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్ పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం.. దీంతో యువత Gen-z పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. కాఠ్మాండులో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. వేలాదిమంది యువకులు నేపాల్ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు రమేష్ లేఖక్.
![]()
