World
జర్నలిస్టు మరణానికి ముందు చేసిన మెసేజ్.. హృదయాల్ని కదిలించింది..
గాజా: పాలస్తీనాలో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే లక్ష మేరకు ప్రజలను నరమేధం చేసింది.. ఆ దుర్మార్గాలు బయట పడకుండా 230 జర్నలిస్టులను హతమార్చింది. ప్రస్తుతం గాజా స్ట్రిప్లో నిన్న ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు. వారిలో అనాస్ జమాల్ అల్-షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది..
ఇది నా వీలునామా, నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్-మజాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని ( ఇరుగు, పొరుగు అరబ్బు దేశాలు) గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు.
పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు.
మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. అలాగే నా కుటుంబ సభ్యులకు అల్లాహ్ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను..అని ముగించారు. ఇది మెసేజ్ విన్నాకా ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ దురాగతాలపై, ఆ దేశానికి వెన్నుదన్నుగా ఉన్న అమెరికా లపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
![]()
