India
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన: మెడికల్ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిన విషాదం
విమాన ప్రమాదం: మెడికల్ హాస్టల్‌పై కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం – 20 మందికి పైగా విద్యార్థుల మృతి
అహ్మదాబాద్‌లో గురువారం ఉదయం దారుణమైన విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపంతో అదుపుతప్పి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రయాణికులు మృతిచెందారు. విమాన సిబ్బంది, పైలట్లు సహా అందరూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
విమానం కూలిన భవనంలో ఉన్న మెడికల్ విద్యార్థులపై ఇది మరింతగా ప్రభావం చూపింది. అప్పటికి హాస్టల్‌లో ఉన్న 20 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఎంత మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నారనే విషయం ఇంకా ఖచ్చితంగా తేలలేదు.
ఈ ఘటన అనంతరం అక్కడ భారీ మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని కమ్మే పొగతో పాటు, దహనమైన శరీరాల ముద్రలు ఘటన తీవ్రతను సూచిస్తున్నాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు కష్టంగా మారిందని, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మాత్రమే స్పష్టత రావచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయనే స్వయంగా అహ్మదాబాద్‌కి చేరుకొని బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అధికారులు, రెస్క్యూ టీంలతో సమీక్ష నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రమాద స్థలానికి పర్యటనకు రానున్నారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం సహాయ చర్యలకు తక్షణమే స్పందించాయి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయమందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.
![]()
